మా ఊరికి ఉత్తరాన ఒకప్పుడు అన్నవరప్పాడు దిబ్బలు ఉండేవి. ఇప్పుడు లేవు. ఆ దిబ్బల్ని తవ్వేసి, ఆ మట్టిని తోలేసి మా ఊర్లో ఇళ్లు కట్టుకున్నాం. అంటే ఇప్పుడు మేమంతా ఆ పాత అన్నవరప్పాడు మీదనే కాపురం ఉంటున్నామన్నమాట. చరిత్ర మీద మట్టి వేయడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది ఒక్కోసారి.
నిజానికి ఆ దిబ్బల్ని తవ్వేటప్పుడు అబ్బురపరిచే దృశ్యాలు బయటపడేవట. నేను కళ్ళారా చూడలేదు కానీ, మా పెద్దోళ్లు చెబుతుంటే విన్నాను. మట్టి పొరల్లోంచి మనిషి పట్టేంత పెద్ద పెద్ద కుండలు
బయటపడేవట. ఒక్కో కుండ ఒక్కో మనిషంత పొడుగు. అవి కేవలం మట్టి పాత్రలు కావు, ఆ కాలపు ధాన్యాన్ని దాచుకున్న గిడ్డంగులు. ఒక ఊరు ఆకలిని భద్రపరిచిన ఆ ధాన్యపు గాదెలు తవ్వకాల్లో బయటపడుతుంటే, చూసిన వాళ్లంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేవారట. ఆ పాత్రలతో పాటు ప్రజలు వాడిన వస్తువులు కూడా దొరికేవి.
ఆ దిబ్బల చుట్టూ రకరకాల కథలు ప్రచారంలో ఉండేవి: ఒకప్పుడు అక్కడ అన్నవరప్పాడు గ్రామం ఉండేదని, ఒక పెద్ద భూకంపం వచ్చి ఊరంతా భూమిలోకి కుంగిపోయిందని ఒకరు..
లేదు, ఊరంతా ఖాళీ అయిపోయిందని మరొకరు..
కాదు, పాత ఊరు మెల్లిగా షిఫ్ట్ అయి ఇప్పుడున్న మా ఊరు ఈగా మారిందని ఇంకొకరు..
ఇన్ని కథలు విన్నాక అసలు ఆ ఊరు ఉందా లేదా అని నాకూ అప్పుడప్పుడు అనుమానం వచ్చేది. కానీ ఈ మధ్యే ఆన్‌లైన్‌లో "గుంటూరు జిల్లాలో అదృశ్య గ్రామాలు" అనే పుస్తకం చూశాను. అందులో 1712 నాటి కొండవీడు రాజ్య విభజనలో భాగంగా 'చేబ్రోలు సమితి' పరిధిలో ఉన్న 28 గ్రామాల్లో అన్నవరప్పాడు ఒకటిగా పేర్కొన్నారు. చరిత్ర సాక్షిగా ఆ ఊరు ఉనికి నిజమని తెలిశాక ఆ దిబ్బల మీద నాకు మరింత గౌరవం పెరిగింది.
ఏదైతేనేం, ఒకప్పటి అన్నవరప్పాడు ఇప్పుడు మా ఇళ్ల కింద మెరకగా మారిపోయింది. ఆ దిబ్బలు ఇప్పుడు కంటికి కనిపించవు కానీ, మా ఊరి మట్టిని తడిపితే ఇప్పటికీ ఆ పాత జ్ఞాపకాల తాలూకు వాసన వస్తూనే ఉంటుంది. మన గతాన్ని మనం మర్చిపోయినా, ఆ నేల మాత్రం తనలో దాచుకున్న ఆనవాళ్లను అప్పుడప్పుడు ఇలా బయటపెడుతూనే ఉంటుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి