Wednesday, June 25, 2025

మోతాదు గారు: ఊరు నమ్మిన మనిషి


                      ఆయన పేరు ఊరందరికీ అంతగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఆ ఊరిలో "మోతాదు గారు" అంటే తెలియని వారుండరు. 

          తండ్రి నుండి వారసత్వంగా అందిన ఆ ఉద్యోగ బాధ్యతను మోతాదు గారు ఓ ఆధ్యాత్మిక సేవగా మార్చుకున్నారంటే అది అక్షర సత్యం, అతిశయోక్తి కాదు.

ఆ రోజుల్లో మీసేవ లేదు, మొబైల్ డౌన్‌లోడ్‌లు లేవు. ఒక్క కుల ధృవీకరణ పత్రం కావాలంటే పదులసార్లు కాళ్లరిగేలా తిరగాలి. ఓ పింఛను పాస్ కావాలంటే పది మంది సిఫారసులు కావాలి. రేషన్ కార్డులో ఓ చిన్న అక్షర దోషం సరిచేయాలంటే, ఆ ఫైలు వెంట కాళ్లు బొబ్బలెక్కినా వదిలిపెట్టకుండా తిరగాలి. ఆ కాలంలో, ప్రజల భవిష్యత్తుకు, వారి రోజువారీ అవసరాలకు మధ్యలో ఓ దృఢమైన సేతువులా ఉన్నది– ఆయనే మోతాదు గారు.

ఏ అవసరం వచ్చినా... ఆదాయ ధృవీకరణ పత్రం కావాలా? నివాస ధృవీకరణ పత్రం కావాలా? పుట్టిన పిల్లకు జనన ధృవీకరణ పత్రం కావాలా? ఇంటికి కొత్తగా రేషన్ కార్డు తెప్పించుకోవాలా? ఓ వృద్ధుడికి పింఛను మంజూరు కావాలా? జాబితాలో ఎవరి పేరు అయినా తప్పిపోయిందా? ఎవరికైనా ఓటు కావాలా? – ఏ సమస్య వచ్చినా, ఊరిలో ప్రతీ నోటి నుండి వెలువడే మొదటి మాట అదే, "మోతాదు గారి దగ్గరకు వెళ్ళండి!"

ఆయనకు అధికారులకంటే ఎక్కువ గౌరవం ఉండేది. ఊరిలో మున్సబున్నా, కరణం ఉన్నా, ఆర్‌.ఐ. ఉన్నా, చివరికి ఎమ్మార్వో ఉన్నా, వారి దగ్గరకు వెళ్లాలంటే భయం. వారికి వీరెవరో సరిగ్గా తెలియదు, వీరికి వారెవరో సరిగా తెలియదు. కానీ మోతాదు గారు? ఎవరైనా వస్తే, అది ఏ సమయమైనా, ఎన్నిసార్లైనా... ఆయన పెదవుల నుండి వచ్చే ఒకే ఒక్క మాట: "నాకు చేతనైనంత చేస్తా బాబూ."

ఆయన తలపాగా వేసుకుని, చేతిలో ఫైలు పట్టుకుని, ఎండను భరిస్తూ, వానలో తడుచుకుంటూ తిరిగేవారు. ఆయనకు ప్రతి ఫైలూ కేవలం కాగితాల కుప్ప కాదు – అది ఓ కుటుంబం ఆశ. ఒక్కోసారి తిరిగి తిరిగి వచ్చినా పని అయిపోతుందో లేదో తెలీదు. అయినా సరే, వెనక్కి తగ్గడం తెలియని వ్యక్తి ఆయన. ఆఫీసుల్లో ఆయనంటే గౌరవం అణువణువునా నిండి ఉండేది. ఊరిలో ఒక్కసారైనా ఆయన సహాయం తీసుకోని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. "మోతాదు గారు ఉన్నారంటే పని అయిపోతుంది," – ఇది ఊరంతా నమ్మిన మాట, నిజమైన మాట!

ఈ రోజుల్లో చిన్నపిల్లలు సైతం చెబుతారు – "అప్లై చెయ్యి ఆన్‌లైన్‌లో!" "మీసేవాలో ఫిల్ చెయ్యి!" "డౌన్‌లోడ్ చెయ్యి!" కానీ వారికి తెలియదు – ఒక ధృవీకరణ పత్రం వెనుక ఓ జీవితం నిండిపోయి ఉంటుందని. పింఛను అంటే ఓ వృద్ధుడికి మందులు కొనుక్కునే డబ్బు. రేషన్ అంటే కడుపునిండే అన్నం. కుల ధృవీకరణ పత్రం అంటే చదువుకున్నవాడికి ఉద్యోగం. వాటన్నిటినీ, ఏ విధమైన స్వార్థం లేకుండా, ఓ వారధిగా నిలబడి అందించిన మానవతా మూర్తి మోతాదు గారు.

మా పొలాల లెక్కలు తెలియాలంటే వచ్చే సర్వేయర్‌కి మార్గదర్శి ఆయనే, పొలం సిస్తు కట్టాలన్నా ఆయన ద్వారానే, సంక్షేమ పథకాల వివరాలు కావాలన్నా అప్పట్లో ఆయనే దిక్కు. ఊరిలోకి ఏ అధికారి వచ్చినా వారికి ఆసరా ఆయనే. మా అందరివాడు.. మా మోతాదు గారు.

ఆయన ఇప్పుడు లేరు, ఆయన పేరు నోటి మాటల్లో లేదు – కానీ గుండెల్లో మాత్రం చెరిగిపోని జ్ఞాపకంగా మిగిలిపోయింది. పేరు చెప్పకపోయినా, "మోతాదు గారు" అనే మాట వినిపించినప్పుడల్లా మనసు దానంతటదే తల్లడిల్లుతుంది. ఎందుకంటే – ఆయన ఊరి ఉద్యోగి కాదు. ఆయన ఊరంతా నమ్మిన మనిషి!

No comments: